తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : మైలర్ దేవ్ పల్లి డివిజన్ పరిధిలోని ఆదర్శ కాలనీలో చేనేత సహకార సంఘం ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. చేనేత సహకార సంఘం అధ్యక్షులు పున్న కృష్ణయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ కార్పొరేటర్ టీ. ప్రేమ్ దాస్ గౌడ్ హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ టీ. ప్రేమ్ దాస్ గౌడ్ మాట్లాడుతూ, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నామని అన్నారు. దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని, యువత దేశభక్తి, క్రమశిక్షణతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. దేశ సమగ్రత, ఐక్యతను కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చేనేత సహకార సంఘం ప్రతినిధులు, సభ్యులు, కాలనీ పెద్దలు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.
