తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, హైదరాబాద్: చేనేత రంగంపై సమాజంలో ఉన్న ప్రస్తుత కథనాన్ని మార్చాల్సిన అవసరం ఉందని, చేనేతను కేవలం సానుభూతితో చూసే దృక్పథం నుంచి ప్రపంచానికి అవసరమైన ఉత్పత్తిగా గుర్తించే స్థాయికి తీసుకెళ్లాలని నిపుణులు అభిప్రాయపడ్డారు.
చేనేత దినోత్సవ వ్యవస్థాపకులు యర్రమాద వెంకన్న నేత అధ్యక్షతన WEAVEINDIA Trust మరియు The Culinary Lounge సంయుక్తంగా “Handloom: CHANGE THE NARRATIVE – From Sympathy to Global Need” అనే కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ కార్యదర్శి హరి చందన, IAS, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ మంజుల అనగాని, NIFT డైరెక్టర్ మాలిని దివకల, పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతకింది మల్లేశం, Erisri ఫౌండర్, క్రియేటివ్ డైరెక్టర్ జ్యోతి రెడ్డి, Schoolnet జాతీయ సలహాదారు H.K. చారితో పాటు ప్రముఖ డిజైనర్లు, చేనేత రంగంపై పనిచేస్తున్న సంస్థల ప్రతినిధులు, జాతీయ అవార్డు గ్రహీతలు, చేనేత నిపుణులు, కళాకారులు పాల్గొన్నారు.

సానుభూతి కాదు.. ప్రపంచ అవసరంగా చేనేత
ప్రస్తుతం చేనేత రంగాన్ని చూసే విధానంలో మార్పు రావాల్సిన అవసరం ఉందని కార్యక్రమంలో పాల్గొన్న నిపుణులు పేర్కొన్నారు. ప్రభుత్వాలు, పౌర సమాజం చేనేతపై కేవలం సానుభూతి చూపడం కాకుండా, చేనేత ఉత్పత్తులు ప్రపంచానికి ఎందుకు అవసరమో ప్రజలకు తెలియజేయాల్సిన సమయం ఆసన్నమైందని అభిప్రాయపడ్డారు. ప్రత్యేకంగా పర్యావరణ పరిరక్షణపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో, పర్యావరణ అనుకూలమైన ఉత్పత్తి విధానంగా చేనేతకు ఉన్న ప్రాధాన్యతను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
విద్యా వ్యవస్థలో చేనేతపై అవగాహన
చేనేతపై అవగాహనను విద్యా వ్యవస్థ నుంచే ప్రారంభించాలని నిపుణులు సూచించారు. విద్యార్థులకు చేనేత కళ, సంప్రదాయం, ఉపాధి అవకాశాలు, పర్యావరణ అనుకూలత, స్థిరమైన ఫ్యాషన్‌లో చేనేత పాత్ర వంటి అంశాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. చేనేత రంగం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు ప్రభుత్వ విధాన రూపకల్పనలోనూ మార్పులు రావాల్సిన అవసరం ఉందని సమావేశంలో చర్చించారు.
లోతైన అధ్యయనం.. జాతీయస్థాయిలో కార్యక్రమాలకు ప్రణాళిక
“Change the Narrative” అంశంపై కార్యక్రమంలో లోతైన అధ్యయనం, చర్చ జరిగింది. చేనేత రంగానికి సంబంధించిన వివిధ అంశాలపై నిపుణులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. చేనేతను ప్రపంచ స్థాయిలో మరింత విస్తృతంగా ప్రోత్సహించేందుకు జాతీయస్థాయిలో కార్యక్రమాలు నిర్వహించడం, ప్రభుత్వ ప్రతినిధులతో సమన్వయం చేయడం వంటి అంశాలపై పలువురు ఆసక్తి వ్యక్తం చేశారు.
చేనేత రంగాన్ని సానుభూతి ఆధారిత దృక్పథం నుంచి బయటకు తీసుకువచ్చి, సుస్థిరమైన భవిష్యత్తుకు అవసరమైన ప్రపంచ ఉత్పత్తిగా చేనేతను స్థాపించేందుకు సమిష్టి కృషి అవసరమని కార్యక్రమం ద్వారా పిలుపునిచ్చారు.
