• నవంబర్‌లో ప్రారంభోత్సవం నిర్వహించాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచన
• చేనేత సమస్యలపై సీఎంకు వినతిపత్రం.. పరిష్కారానికి సానుకూల స్పందన
తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, హైదరాబాద్: కొత్తపేట సెంటర్‌లో ఎల్బీనగర్ పద్మశాలి వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబోయే 33 అడుగుల భారీ కాంస్య తెలంగాణ జాతిపిత ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్‌రెడ్డిని పద్మశాలి సామాజిక ప్రముఖులు ఆహ్వానించారు. బుధవారం సచివాలయంలో జరిగిన సమావేశంలో విగ్రహ ప్రారంభోత్సవానికి సీఎంను ఆహ్వానిస్తూ కరపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కరపత్రాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు.

విగ్రహ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నవంబర్‌లో నిర్వహించాలని సీఎం సూచించినట్లు పద్మశాలి నాయకులు తెలిపారు. కార్యక్రమానికి తగిన తేదీలను పరిశీలించి ఖరారు చేసేందుకు సీఎం సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు. విగ్రహ ప్రారంభోత్సవం సందర్భంగా కొత్తపేటలో వేలాది మందితో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎల్బీనగర్ పద్మశాలి వెల్ఫేర్ ట్రస్ట్ చైర్మన్ పున్న గణేష్ నేత తెలిపారు.
పద్మశాలీల ఐక్యతతో మరిన్ని సత్ఫలితాలు
పద్మశాలీలు సమిష్టిగా ముందుకు సాగితే సామాజికంగా, ఆర్థికంగా మరిన్ని సత్ఫలితాలు సాధించవచ్చని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నట్లు నాయకులు తెలిపారు. కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు, తెలంగాణ ఉద్యమంలో ఆయన పోషించిన పాత్రను స్మరించుకుంటూ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని నాయకులు వివరించారు.
అప్పటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ కొండా లక్ష్మణ్‌ను ‘బాపూజీ’గా సంబోధించారని, ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆయనను ‘తెలంగాణ జాతిపిత’గా పేర్కొనడం పద్మశాలి సమాజానికి గౌరవంగా భావిస్తున్నామని పున్న గణేష్ నేత తెలిపారు. ఇందుకు ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
చేనేత రంగ సమస్యలపై సీఎంకు వినతి
సమావేశంలో అఖిల భారత పద్మశాలి సంఘం, తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా చేనేత సహకార సంఘాలు, చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ముఖ్యమంత్రికి వినతిపత్రం సమర్పించారు.
చేనేత సహకార రంగాన్ని బలోపేతం చేయడంతో పాటు, పెండింగ్‌లో ఉన్న నిధులను విడుదల చేసి చేనేత కార్మికులను ఆదుకోవాలని నాయకులు కోరారు. వినతిపత్రంపై సీఎం సానుకూలంగా స్పందించి, సంబంధిత అధికారులతో చర్చించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు.
ప్రధానంగా 15 నెలలుగా పెండింగ్‌లో ఉన్న తిఫ్ట్ ఫండ్ ప్రభుత్వ వాటా నిధుల విడుదల, చేనేత పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న 18,005 మంది కార్మికులకు పెన్షన్ మంజూరు, చేనేత సహకార సంఘాల క్యాష్ క్రెడిట్ బకాయిల మాఫీ, పెండింగ్ నేతన్న భరోసా నిధుల విడుదల, చేనేత కార్మికుల పెండింగ్ బీమా మొత్తాల చెల్లింపు వంటి అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు.
అలాగే సహకార సంఘాల్లో నిల్వ ఉన్న చేనేత వస్త్రాలను ప్రభుత్వం కొనుగోలు చేయాలని, చేనేత కార్మికులకు బ్యాంకుల ద్వారా వ్యక్తిగత రుణాలు ఇప్పించాలని, పెండింగ్ జియో ట్యాగ్‌లను మంజూరు చేయాలని, 50 సంవత్సరాలు పైబడిన జియో ట్యాగ్ కలిగిన ప్రతి చేనేత కార్మికుడికి పెన్షన్ ఇవ్వాలని కోరారు.
అర్హులైన ప్రతి చేనేత కార్మికుడికి గుర్తింపు కార్డులు జారీ చేయడం, ముద్రా రుణాల సబ్సిడీని 50 శాతానికి పెంచడం, నూతనంగా ఎన్నికైన చేనేత సహకార సంఘాలకు క్యాష్ క్రెడిట్ మంజూరు చేయడం, గతంలో అమలు చేసిన 20 శాతం రిబేట్ పథకాన్ని పునరుద్ధరించడం, టెస్కో చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులను విడుదల చేయడం వంటి డిమాండ్లను కూడా వినతిపత్రంలో పొందుపరిచారు.
నూలు, రంగులు, రసాయనాలు, చేనేత వస్త్రాలపై జీఎస్టీ తొలగించడంతో పాటు గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలు, గ్రేటర్ కార్పొరేషన్లలో నిర్వహించే గ్రామసభల్లో చేనేత సహకార సంఘాల అధ్యక్షులకు ప్రాతినిధ్యం కల్పించాలని నాయకులు కోరారు.
చేనేత రంగ పునరుజ్జీవనంపై దృష్టి అవసరం: గుజ్జ సత్యం
ఈ సందర్భంగా మీడియా సమావేశంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం మాట్లాడుతూ.. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీకి 33 అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఆయన చరిత్రను భవిష్యత్ తరాలకు పరిచయం చేసే ప్రయత్నమన్నారు.
అయితే విగ్రహ నిర్మాణంతో పాటు బాపూజీ ఆశయాలను ఆచరణలోకి తీసుకురావడం, చేనేత కార్మికుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, చేనేత సహకార వ్యవస్థను బలోపేతం చేయడం కూడా సమాజం, ప్రభుత్వం ముందున్న ముఖ్యమైన బాధ్యతలని గుజ్జ సత్యం పేర్కొన్నారు.
చేనేత రంగంలో పెండింగ్ నిధులు, సహకార సంఘాల ఆర్థిక ఇబ్బందులు, పెన్షన్లు, బీమా, నేతన్న భరోసా, మార్కెటింగ్ తదితర సమస్యలు పరిష్కారమైతే చేనేత కుటుంబాలకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. కొత్తపేటలో జరిగే విగ్రహావిష్కరణను కేవలం ఒక కార్యక్రమంగా కాకుండా చేనేత, పద్మశాలి సామాజిక చైతన్యం, కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలపై విస్తృత చర్చకు వేదికగా నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు.
“విగ్రహం 33 అడుగుల ఎత్తులో ఉండటం ఒక గుర్తింపు అయితే, బాపూజీ ఆశయాలను సమాజంలో మరింత ఎత్తుకు తీసుకెళ్లడమే నిజమైన నివాళి” అని గుజ్జ సత్యం అన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డికి చేనేత మగ్గంపై రూపొందించిన చిత్రపటం బహూకరణ
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సిరిసిల్లలో చేనేత మగ్గంపై ప్రత్యేకంగా తయారు చేసిన ఆయన చిత్రపటాన్ని పద్మశాలి ప్రముఖులు బహూకరించారు. చేనేత కళాకారుల నైపుణ్యానికి ప్రతీకగా ఈ చిత్రపటాన్ని అందజేసినట్లు నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కమ్మర్తపు మురళి, అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షులు కందగట్ల స్వామి, ప్రధాన కార్యదర్శి గడ్డం జగన్నాథం, మాజీ ఎమ్మెల్యే ఈరావతి అనిల్‌కుమార్, పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ గూడూరు శ్రీనివాస్, హ్యాండ్లూమ్ కార్పొరేషన్ చైర్మన్ దూడం వెంకటరమణ, అఖిల భారత పద్మశాలి సంఘం యువజన విభాగం జాతీయ ఇంచార్జ్ అవ్వారి భాస్కర్, ఎల్బీనగర్ సర్కిల్ అధ్యక్షులు పున్న గణేష్ నేత, టీపీఎస్ ఉపాధ్యక్షులు గుర్రం శ్రవణ్, టీపీఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలు గుంతక రూప, ఏపీపీఎస్ మహిళా అధ్యక్షురాలు వనం దుష్యంతల, ఏపీపీఎస్ ఇంజనీరింగ్ విభాగం అధ్యక్షులు పుట్ట పాండురంగయ్య, దసరా మేళ కమిటీ చైర్మన్ కౌకుంట్ల రవితేజ తదితరులు పాల్గొన్నారు.
