తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: మదీనాగూడ డివిజన్ పరిధిలోని హుడా కాలనీలో వినాయక నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 11వ రోజు శ్రీ వినాయక స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హుడా కాలనీ గణేష్ ఉత్సవ్ కమిటీ అసోసియేషన్ ఆహ్వానం మేరకు యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, చైర్మన్ యలమంచి ఉదయ్ కిరణ్ కార్యక్రమానికి హాజరై శ్రీ వినాయక స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం, భక్తులతో కలిసి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. హుడా కాలనీ గణేష్ ఉత్సవ్ కమిటీ ఆధ్వర్యంలో యశ్వంత్ , వారి మిత్రబృందం యలమంచి ఉదయ్ కిరణ్ ను శాలువాలతో ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా యలమంచి ఉదయ్ కిరణ్ మాట్లాడుతు, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, శాంతి, ఐశ్వర్యం, శ్రేయస్సుతో జీవించాలని శ్రీ వినాయక స్వామివారిని ప్రార్థించారు. భక్తి, సేవ, ఐక్యతతో కొనసాగుతున్న ఈ వినాయక ఉత్సవాలు ప్రతి ఇంటా ఆనందం, శాంతి, సౌభాగ్యం, శ్రేయస్సును నింపాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో వంశీ, సతీశ్, రత్నాచారి తదితరులతో పాటు ఉత్సవ కమిటీ సభ్యులు, మహిళలు, యువత, స్థానిక నివాసితులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.