తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : ఎన్నికల సంఘంలో ఏకపక్ష నిర్ణయాల వల్ల తీవ్రమైన అవకతవకలకు అవకాశం ఏర్పడుతోందని ఆరోపిస్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు, రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య డిమాండ్ చేశారు.
సోమవారం శంషాబాద్ మండల కేంద్రంలో సీపీఐ రంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమానికి రాష్ట్ర సమితి సభ్యుడు పానుగంటి పర్వతాలు అధ్యక్షత వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జంగయ్య మాట్లాడుతూ.. ఎస్‌ఐఆర్ పేరుతో దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఓటర్ల పేర్లు తొలగించడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని, ఓటు హక్కుకు భంగం కలిగించే చర్యలకు అవకాశం ఉండకూడదని అన్నారు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ స్వచ్ఛందంగా రాజీనామా చేయకపోతే పార్లమెంటులో దీనిపై చర్చించి చర్యలు తీసుకోవాలని జంగయ్య డిమాండ్ చేశారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియలో 13 కోట్లకు పైగా ఓటర్ల పేర్లు డ్రాఫ్ట్ జాబితాల నుంచి మినహాయించబడ్డాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే ఈ సంఖ్య, ప్రక్రియపై ఎన్నికల సంఘం వివరణలు కూడా వెలువడ్డాయి.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అధికార వ్యవస్థలను ఉపయోగించుకుని ప్రతిపక్షాలపై ఒత్తిడి తెస్తోందని జంగయ్య ఆరోపించారు. ఈడీ, సీబీఐ, ఎన్నికల అధికారులను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారని విమర్శించారు. ఇతర పార్టీల ప్రజాప్రతినిధులను ప్రలోభాలకు గురిచేసి బీజేపీలో చేరేలా చేస్తున్నారని ఆరోపించారు.
ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమైన ప్రభుత్వం ప్రజల్లో ఏర్పడుతున్న వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకు మతాన్ని రాజకీయ ఆయుధంగా ఉపయోగిస్తోందని జంగయ్య విమర్శించారు. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాల్సిన రాజ్యాంగబద్ధ సంస్థలో నిర్ణయాలు నిష్పక్షపాతంగా ఉండాలని ఆయన అన్నారు..జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేసే వరకు సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగిస్తామని జంగయ్య హెచ్చరించారు.
