తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : పద్మశాలిపురంలోని శ్రీశ్రీశ్రీ శివ మార్కండేయ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో పద్మజ్యోతి యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించనున్న 18వ దేవి శరన్నవరాత్రి ఉత్సవాల పోస్టర్‌ను దేవాలయ కమిటీ, యువజన సంఘం కమిటీ సభ్యుల సమక్షంలో ఘనంగా ఆవిష్కరించారు. అక్టోబర్ 11 నుంచి 20 వరకు ప్రతిరోజూ అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. బాలా త్రిపురసుందరి, గాయత్రి, అన్నపూర్ణ, మహాచండి, లలితా త్రిపురసుందరి, సరస్వతి, మహాలక్ష్మీ, దుర్గా, మహిషాసురమర్దిని, రాజరాజేశ్వరి దేవి అలంకారాల్లో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. అక్టోబర్ 21న బుధవారం సాయంత్రం 4 గంటలకు అమ్మవారి ఊరేగింపు నిర్వహించడంతో పాటు ముక్కుపుడక, పట్టు చీరల కార్యక్రమం ఉంటుందని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.
