• ప్రధానితో చంద్రబాబు భేటీ కావాలి: గుజ్జ సత్యం
తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని శాశ్వత పరిష్కారం చూపాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం డిమాండ్ చేశారు. బీసీలకు ఇచ్చిన హామీ మేరకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కోరారు.
మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్ల పెంపు కేవలం రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో సాధ్యమయ్యే పరిస్థితి లేదని, కేంద్ర స్థాయిలో రాజ్యాంగ, చట్టపరమైన మార్పులు అవసరమని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రంలో కీలక భాగస్వామిగా ఉన్నందున ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో వెంటనే భేటీ అయి బీసీ రిజర్వేషన్ల సమస్యకు పరిష్కారం సాధించాలని సూచించారు.
తెలంగాణ, బీహార్ రాష్ట్రాల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై ఎదురైన న్యాయపరమైన సమస్యల నుంచి పాఠాలు నేర్చుకోవాలని చెప్పారు. 50 శాతం రిజర్వేషన్ల పరిమితిపై ఉన్న న్యాయపరమైన పరిస్థితులకు శాశ్వత పరిష్కారం కోసం కేంద్రం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అవసరమైతే తమిళనాడు తరహాలో రాజ్యాంగపరమైన రక్షణ కల్పించే మార్గాలను పరిశీలించాలని కోరారు.
చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వంటి నాయకులు సమన్వయంతో కేంద్రంపై ఒత్తిడి తెస్తే బీసీల రాజకీయ ప్రాతినిధ్య సమస్యకు జాతీయ స్థాయిలో పరిష్కారం సాధ్యమవుతుందని గుజ్జ సత్యం అన్నారు.
34 శాతం బీసీ రిజర్వేషన్లపై స్పష్టమైన నిర్ణయం తీసుకోకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే రాష్ట్రవ్యాప్తంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఉద్యమం చేపడతామని ఆయన హెచ్చరించారు.
