• గుంటక నర్సయ్య పంతులు గారి సేవలు చిరస్మరణీయం…
వారి ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకం…
వారి కీర్తి అజరామరం.• 123వ జయంతి సందర్భంగా ఘన నివాళులు
తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, హైదరాబాద్: పద్మశాలి సమాజ అభ్యున్నతికి, చేనేత వృత్తి పరిరక్షణకు జీవితాన్ని అంకితం చేసిన ప్రముఖ సంఘ సంస్కర్త, చేనేతోద్యమ పితామహుడు శ్రీ గుంటక నర్సయ్య పంతులు గారి 123వ జయంతి సందర్భంగా గుంటక రూప సదాశివ్, గుంటక కుటుంబ సభ్యులు ఘన నివాళులు అర్పించారు.
గుంటక నర్సయ్య పంతులు పద్మశాలి సమాజాన్ని సంఘటితం చేయడంతో పాటు చేనేత సహకార సంఘాల ఏర్పాటుకు విశేష కృషి చేశారని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఆర్మూర్ తాలూకా నుంచి ప్రారంభించి నైజాం రాష్ట్రవ్యాప్తంగా, అనంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ప్రాంతాల్లో పద్మశాలి సంఘాల ఏర్పాటు, సామాజిక చైతన్యానికి ఆయన కృషి చేశారని తెలిపారు.
మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో తెలుగు మాధ్యమ పాఠశాలలు కొనసాగేందుకు ఆయన చేసిన కృషి కీలకమని పేర్కొన్నారు. అలాగే ‘భృగ్వాదుల ప్రభావం’ అనే గ్రంథాన్ని రచించి పద్మశాలి వంశ చరిత్రను విస్తృతంగా పరిచయం చేశారని గుర్తుచేశారు.
కొండా లక్ష్మణ్ బాపూజీని పద్మశాలి సమాజానికి పరిచయం చేయడంలోనూ గుంటక నర్సయ్య పంతులు కీలక పాత్ర పోషించారని కుటుంబ సభ్యులు తెలిపారు. నారాయణగూడ పద్మశాలి భవన్ నిర్మాణానికి, కరీంనగర్ పద్మశాలి హాస్టల్ రూపకల్పనకు ఆయన విశేషంగా కృషి చేశారని పేర్కొన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పద్మశాలి భవనాలు, విద్యార్థుల వసతి గృహాలు, చేనేత సంఘాల ఏర్పాటుకు ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు.
అఖిల భారత పద్మశాలి యువజన సంఘం ద్వితీయ, తృతీయ మహాసభల అధ్యక్షుడిగా, అలాగే అఖిల భారత పద్మశాలి సంఘం ద్వాదశ మహాసభ అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు నిర్వహించారని తెలిపారు. పద్మ కాలనీ వ్యవస్థాపకుడిగా కూడా ఆయన సేవలు అందించారని గుర్తుచేశారు.
చేనేత వృత్తికి గౌరవం, విద్యాభివృద్ధి, సంఘటిత శక్తి, సామాజిక చైతన్యం వంటి అంశాలకు ప్రాధాన్యతనిస్తూ నర్సయ్య పంతులు చేసిన కృషి నేటి తరానికి స్ఫూర్తిదాయకమని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
“కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన” అనే భగవద్గీతా సూక్తిని ఆచరణలో పెట్టి, ఎలాంటి ఫలాపేక్ష లేకుండా పద్మశాలి సమాజ అభ్యున్నతికి, చేనేత వృత్తి పరిరక్షణకు ఆయన తన జీవితాన్ని అంకితం చేశారని వారు కొనియాడారు.
గుంటక నర్సయ్య పంతులు గారి సేవలు పద్మశాలి సమాజానికి చిరస్మరణీయమని, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని గుంటక రూప సదాశివ్, గుంటక కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
