తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్: చిన్నకోడూరు ఆపద సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) కొండంత అండగా నిలుస్తోందని కాంగ్రెస్ యువ నాయకులు అజ్జు యాదవ్ అన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చెర్లఅంకిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఓ లబ్ధిదారుడికి మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును ఆయన శనివారం అందజేశారు.రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సహకారంతో, సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి పూజల హరికృష్ణ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా అజ్జు యాదవ్ మాట్లాడుతూ, అనారోగ్యం, వైద్య ఖర్చులు, ఇతర అత్యవసర పరిస్థితుల వల్ల ఆర్థికంగా నష్టపోయిన పేదలకు ఈ నిధి ఎంతో ఊరటనిస్తుందని పేర్కొన్నారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరంతరం కృషి చేస్తారని ఆయన స్పష్టం చేశారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. తమకు ఆర్థిక సహాయం అందించినందుకు లబ్ధిదారుని కుటుంబ సభ్యులు ప్రభుత్వానికి, సహకరించిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చిక్కుడు అనిల్ కుమార్, గొల్లపల్లి శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.