తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్: చిన్న కోడూర్ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ఆదేశాల మేరకు.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు, ప్రస్తుతం రాష్ట్రంలో సాగుతున్న పాలనలోని వాస్తవాలను ప్రజలకు వివరించేందుకు “గ్రామ గ్రామాన BRSV” కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు బీఆర్‌ఎస్‌వీ నాయకులు తెలిపారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను, ఇతర వాగ్దానాలను పూర్తిస్థాయిలో అమలు చేయకుండా కాలయాపన చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ, ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయకుండా విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటోందని మండిపడ్డారు. నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను, ఉద్యోగ నియామకాలపై ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును గ్రామస్థాయి నుంచి ప్రజల దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు.మహిళలు, యువత, విద్యార్థులకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాలను ప్రశ్నిస్తూ, ప్రజా సమస్యలపై బీఆర్‌ఎస్‌వీ నిరంతరం గళం విప్పుతుందని భరోసా ఇచ్చారు. ప్రభుత్వ మొండి వైఖరి మారేంత వరకు గ్రామగ్రామానా పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌వీ నాయకులు గణగోని శ్రవణ్ గౌడ్, చెట్టుపల్లి భాను చందర్, గొల్లపల్లి రాజశేఖర్ రెడ్డి, మన్నె ఆనంద్, కొలను రఘు, నముండ్ల శ్రీకాంత్, ఎలుక అనిల్ తదితరులు పాల్గొన్నారు.
