తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : మైలార్‌దేవ్‌పల్లి, కాటేదాన్ డివిజన్ల పరిధిలో పనిచేయని వీధిలైట్ల సమస్యను వెంటనే పరిష్కరించి, ప్రజలకు రక్షణ కల్పించాలని కాటేదాన్ డివిజన్ బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు ఎస్. వెంకటేష్ అధికారులను డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. వీధిలైట్లు వెలగక పోవడంతో స్థానికులు, ముఖ్యంగా మహిళలు, వృద్ధులు రాత్రి వేళల్లో తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బెంగళూరు నేషనల్ హైవే నుండి శాస్త్రీపురం/శిరాంపల్లి రైల్వే గేట్ మీదుగా బాబుల్‌రెడ్డి నగర్ వరకు మార్గమంతా చిమ్మచీకటిగా మారిందని, ఇది అసాంఘిక శక్తులకు స్థావరంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. గతంలోనే ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయమన్నారు. ప్రజా పాలన అని చెప్పుకునే ఈ ప్రభుత్వం, కనీసం వీధిలైట్ల రిపేర్లు కూడా చేయించలేకపోతోందని విమర్శించారు. త్వరలో రాబోతున్న బతుకమ్మ, దసరా నవరాత్రి ఉత్సవాలను దృష్టిలో ఉంచుకుని జీహెచ్‌ఎంసీ అధికారులు తక్షణమే స్పందించాలని కోరారు. పనిచేయని వీధిలైట్ల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాలని లేదా ఉన్నవాటికి తక్షణమే మరమ్మతులు పూర్తి చేసి వెలిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం బిఆర్‌ఎస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని ఈ సందర్భంగా వెంకటేష్ స్పష్టం చేశారు.
