నల్గొండ: జియో ట్యాగ్‌తో సంబంధం లేకుండా దరఖాస్తు చేసుకున్న చేనేత కార్మికులందరికీ ఆసరా పెన్షన్లు ఇవ్వాలని తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి మురళీధర్ డిమాండ్ చేశారు. సోమవారం సంఘం నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి, కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.

జిల్లాలో సుమారు వెయ్యి మంది అర్హులు దరఖాస్తు చేసుకోగా, కేవలం 465 మందికే మంజూరు పత్రాలు ఇచ్చారని ఆయన తెలిపారు. చేనేత భరోసా యార్న్ సబ్సిడీ మూడేళ్లుగా, త్రిఫ్ట్ ఫండ్ ప్రభుత్వ వాటా రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయని, కార్మికులు మాత్రం ప్రతి నెలా తమ వాటా జమ చేస్తున్నారని అన్నారు.

ప్రతి చేనేత కార్మికుడికి బీమా, అంత్యోదయ కార్డులు ఇవ్వాలని, ఇందిరమ్మ ఇళ్లలో ప్రత్యేక కోటా కేటాయించి ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కర్నాటి వెంకటేశం, జిల్లా అధ్యక్షుడు కందగట్ల గణేష్, ఉపాధ్యక్షులు వనం రాములు, గడ్డం రమణయ్య, చెరుకు సత్యనారాయణ, ఆలుగొండ మధు, నామని ప్రభాకర్, కుకుడాల ఆంజనేయులు, నామని సుధాకర్, గంజి రాజేష్, గడ్డం దశరథ తదితరులు పాల్గొన్నారు.