తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: ఉమ్మడి మియాపూర్ డివిజన్ పరిధిలోని జయప్రకాశ్ నారాయణ్ నగర్ కాలనీలో లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ 124వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మియాపూర్ డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ హాజరై, కాలనీ వాసులతో కలిసి ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ, జయప్రకాశ్ నారాయణ్ దేశ ప్రజాస్వామ్య పరిరక్షణకు, ప్రజా హక్కుల సాధనకు చేసిన సేవలను వెలకట్టల్నివని, సమాజంలో నైతిక విలువలను పెంపొందించడం, అవినీతికి వ్యతిరేకంగా పోరాడటం, ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడం కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విలువలు, సామాజిక న్యాయం, ప్రజల సంక్షేమం కోసం జయప్రకాశ్ నారాయణ్ చూపిన మార్గం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని, ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకొని సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జయప్రకాశ్ నారాయణ్ నగర్ కాలనీ అధ్యక్షులు మోహన్ రావు, కాలనీ వాసులు శ్రీధర్ చారి, జగదీశ్వర్, లక్ష్మారెడ్డి, వెంకట్రావు, మోహన్ రెడ్డి, రామాంజనేయ రెడ్డి, శ్రీనివాస్, నరేందర్, రమేష్, రాఘవరావు, శ్రీనివాస్ రెడ్డి, రవి, తదితరులు పాల్గొన్నారు.