• కామారెడ్డి జిల్లా పద్మశాలి సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం
• డా. పవిత్ర వాణి బాపూజీకి గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ఇవ్వాలని ఏకగ్రీవ తీర్మానం
తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, కామారెడ్డి: పద్మశాలీల ఐక్యతను బలోపేతం చేస్తూ, నేతన్నల సంక్షేమానికి నూతన కార్యవర్గం కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షుడు వల్లకటి రాజ్‌కుమార్ పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లా పద్మశాలి సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన సిరిగధ లక్ష్మీనరసింహులు, నూతన కార్యవర్గ సభ్యులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

పద్మశాలీల చరిత్ర, సంప్రదాయాలు గొప్పవి
ఈ సందర్భంగా గంజి శ్రీనివాస్ మాట్లాడుతూ.. పద్మశాలీలకు భక్త మార్కండేయ మహర్షి మూలపురుషుడని, చేనేత వృత్తి, సంస్కృతి, సంప్రదాయాలు తమ జాతి ప్రత్యేకతకు ప్రతీకలని పేర్కొన్నారు. దేవతామూర్తుల కోసం వస్త్రాలు నేయడం, దేశవ్యాప్తంగా అనేక దేవాలయాల్లో దేవతల కల్యాణోత్సవాలకు పట్టువస్త్రాలు సమర్పించడం పద్మశాలీలకు గర్వకారణమని అన్నారు. తమ జాతి పుట్టుక, వృత్తి, ఆధ్యాత్మిక సంప్రదాయాలు ఎంతో పవిత్రమైనవని తెలిపారు.
కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను కొనసాగించాలి
తెలంగాణ ఉద్యమంలో విశిష్ట పాత్ర పోషించిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ పద్మశాలి సమాజానికి గర్వకారణమని గంజి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆయన జీవితం, పోరాటం, సేవలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. బాపూజీ ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
పదవి అంటే బాధ్యత.. నేతన్నలకు అండగా నిలవాలి
తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆఫీస్ ఇన్‌చార్జి గంజి శ్రీనివాస్ నేత మాట్లాడుతూ.. సంఘంలో పదవి అనేది భోగం అనుభవించడానికి కాదని, సమాజం పట్ల బాధ్యతను నెరవేర్చడానికి అని అన్నారు. జిల్లా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన నాయకత్వం ప్రతి నేతన్న కన్నీరు తుడిచేలా, ప్రతి పద్మశాలి బిడ్డ విద్యకు అండగా నిలిచేలా పనిచేయాలని సూచించారు.
డా. పవిత్ర వాణి బాపూజీకి ఎమ్మెల్సీ ఇవ్వాలని ఏకగ్రీవ తీర్మానం
ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వారసురాలు డా. పవిత్ర వాణి బాపూజీకి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి కల్పించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మీడియా ద్వారా కోరినట్లు గంజి శ్రీనివాస్ నేత తెలిపారు. ఈ డిమాండ్‌కు మద్దతుగా కామారెడ్డి జిల్లా పద్మశాలి సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార సభలో జిల్లా సంఘం ఆధ్వర్యంలో ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం గౌరవ అధ్యక్షుడు వేముల బాలరాజు, ఉపాధ్యక్షులు తిరందాసు ధనంజేయ, మ్యాకల జయరాములు, వనమాల శంకర్, సామల వెంకటేష్, రాజకీయ విభాగం కన్వీనర్ గుంటి నగేష్, గ్రేటర్ హైదరాబాద్ యూత్ అధ్యక్షుడు సంతోష్, జర్నలిస్టులు సిలివేరు నాగరాజు, కొండబత్తిని కర్ణాకర్, బొమ్మిడాల లక్ష్మణ్, రాంపెల్లి లింగమూర్తి తదితర రాష్ట్రస్థాయి నాయకులు పాల్గొన్నారు.
పద్మశాలి సమాజ ఐక్యత, నేతన్నల సంక్షేమం, విద్యా అభివృద్ధి, సామాజికంగా మరియు రాజకీయంగా సమాజానికి తగిన ప్రాతినిధ్యం కల్పించడం వంటి అంశాలపై ఈ కార్యక్రమంలో నాయకులు దిశానిర్దేశం చేశారు.
