తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ :  భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ సభ్యుడు పుస్తకాల నర్సింగరావు పిలుపునిచ్చారు. సీపీఐ జాతీయ సమితి పిలుపు మేరకు భారత రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం రాజేంద్రనగర్ మండల కేంద్రంలోని చౌరస్తాలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సీపీఐ మండల సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మండల కార్యదర్శి కన్యగారి నర్సింహారెడ్డి అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా పాల్గొన్న పుస్తకాల నర్సింగరావు మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న మతతత్వ విధానాలు, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయని విమర్శించారు. దేశంలో ప్రజాస్వామ్య విలువలు, లౌకికవాదం, రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మైనారిటీలపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించారు. మైనారిటీల ఓట్లను తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలందరికీ, ముఖ్యంగా మైనారిటీలకు తగిన రక్షణ కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

 

రానున్న డిసెంబర్ 1, 2, 3 తేదీల్లో దేశవ్యాప్తంగా నిర్వహించనున్న జైల్ భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో డిసెంబర్ 2న శంషాబాద్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించనున్న కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం.ఏ. రియాజ్, జిల్లా కౌన్సిల్ సభ్యుడు జె. ఆనంద్ గౌడ్, భారత జాతీయ మహిళా సమాఖ్య రంగారెడ్డి జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షురాలు, సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యురాలు కన్యగారి లక్ష్మి, సీపీఐ మండల సహాయ కార్యదర్శి జె. విజయానంద్ గౌడ్, మండల కార్యాలయ కార్యదర్శి జి. సత్యం, బీసీ సంఘం రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు జె. సదానంద గౌడ్, మహిళా సమాఖ్య మండల అధ్యక్షురాలు మునేశ్వరి, ఏఐటీయూసీ మండల అధ్యక్ష, కార్యదర్శులు ఎం.డి. సలీం, సయ్యద్ కాజా, సీపీఐ నాయకులు, మహిళా సమాఖ్య నాయకులు పాల్గొన్నారు.