తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : జాతీయ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీరాంనగర్ ప్రాథమిక పాఠశాలలో గురువారం వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల సాంస్కృతిక కమిటీ చైర్మన్ ఎస్.కె. అల్లావల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విద్యార్థుల్లో సృజనాత్మకత, వక్తృత్వ నైపుణ్యాలు, కళాత్మక ప్రతిభను వెలికితీసే ఉద్దేశంతో చిత్రలేఖనం, ఉపన్యాసం, పాటల పోటీలను నిర్వహించారు. విద్యార్థులు తమ ప్రతిభను చాటుతూ ఆకట్టుకునే ప్రదర్శనలు ఇచ్చారు. వివిధ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను అందజేసి అభినందించారు.
ఈ సందర్భంగా రాజ్యాంగం ప్రాధాన్యత, పౌరుల హక్కులు, బాధ్యతలు, ప్రజాస్వామ్య విలువలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. రాజ్యాంగ స్ఫూర్తిని చిన్ననాటి నుంచే అలవర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్చార్జి జి. లత, ఆశాజ్యోతి ఉపాధ్యాయులు, ప్రీప్రైమరీ బాధ్యురాలు కవిత తదితరులు పాల్గొన్నారు.
