తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : మూసీ సుందరీకరణ పేరుతో బఫర్ జోన్ పరిమితిని దాటి భూముల సేకరణ చేపట్టవద్దని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి. ప్రకాష్ గౌడ్, బండ్లగూడ జాగీర్ దర్గా కాలేజీ ప్రాంత నివాసితులు ప్రభుత్వాన్ని కోరారు.ఈ మేరకు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును ఆదివారం ఉదయం ఆయన అధికారిక నివాసంలో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఆధ్వర్యంలో కలిసి తమ సమస్యలను వివరించారు. మూసీ సుందరీకరణకు తాము వ్యతిరేకం కాదని, అయితే బఫర్ జోన్ పరిధిని దాటి 500 మీటర్ల వరకు భూములను సేకరించాలనే ప్రతిపాదనతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని నివాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. బఫర్ జోన్ పరిధిలో అవసరమైన భూములనే సేకరించాలని, అదనపు భూసేకరణతో పాటు ఇతర అభివృద్ధి పనులు, హోటళ్ల నిర్మాణాల కోసం భూములు తీసుకోవాలనే ఆలోచనను విరమించుకోవాలని కోరారు. తమ భూములు కోల్పోకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు.
