తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ పరిధిలోని లక్ష్మీగూడ ఫేజ్‌-2 పింక్ కాలనీలో గత మూడు నెలలుగా వీధి దీపాలు వెలగడం లేదు. దీంతో కాలనీలోకి వెళ్లే రహదారి రాత్రివేళల్లో చీకటిమయంగా మారుతోంది. ముఖ్యంగా మహిళలు రాత్రిపూట రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యపై పలుమార్లు స్థానిక నాయకులకు తెలియజేయడంతో పాటు సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడు నెలలుగా సమస్య కొనసాగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వీధి దీపాలను వెంటనే పునరుద్ధరించాలని, రాత్రివేళ మహిళలు, కాలనీ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.