తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : రాజేంద్రనగర్ మండలం శివరాంపల్లి గ్రామ ప్రజల రవాణా ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని గతంలో నడిచిన 9ఎస్‌పీ బస్సు సర్వీసును తిరిగి ప్రారంభించాలని రాజేంద్రనగర్ డివిజన్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పడమటి శ్రీధర్ రెడ్డి కోరారు. ఈ మేరకు రాజేంద్రనగర్ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ డిపో మేనేజర్‌కు వినతిపత్రం సమర్పించారు.శివరాంపల్లి గ్రామంలో సుమారు 30 వేల మంది జనాభా నివసిస్తున్నారని, గతంలో శివరాంపల్లి నుంచి కోఠి వరకు నడిచే 9ఎస్‌పీ బస్సు సర్వీసు ప్రస్తుతం అందుబాటులో లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన వినతిపత్రంలో పేర్కొన్నారు. ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు వైద్య సేవలు పొందేందుకు, ఇతర అవసరాల కోసం ప్రయాణించేందుకు సరైన బస్సు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రజా అవసరాలను పరిగణనలోకి తీసుకొని గతంలో నడిచిన బస్సు సర్వీసును వెంటనే పునరుద్ధరించాలని, ప్రయాణికులకు అనుకూలమైన సమయాల్లో బస్సులు నడిపేలా చర్యలు తీసుకోవాలని పడమటి శ్రీధర్ రెడ్డి కోరారు. అధికారులు స్పందించి గ్రామ ప్రజల రవాణా సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
