🌹 బహుళం 🌹

ఎడారి జీవితమంటారు
కానీ తన నయనాలే
ఉప్పొంగే గోదావరులు !

ఒంటరి జీవితమంటారు
కానీ తన ఇంటిపేరులే
ఒడి నింపే సమూహాలు !

ఆధారం లేనిదని కూడా అంటారు
కానీ తన బొడ్డుదారమే
బహుళమైన ఆధారం !

తనను
తారల్లో చూపుతారు
పూలల్లో పోలుస్తారు
నదుల్లో సైతం కొలుస్తారు
కానీ………..
అన్నీ లెక్కకు మించినవే
ఏ ఒక్కటీ ఒంటివి కానివే !

తనను
ప్రకృతిగ పిలుస్తారు
సౌందర్యంగ భావిస్తారు
వసంతం గా కూడా ఆరాధిస్తారు
కానీ…….
దేనికదే ప్రత్యేక సమూహమే !
ఏకైకంగ విడదీయలేనిదే !

తనను
లక్ష్మంటారు
అష్టలక్ష్ములుగా !
ఋతువంటారు
ఆరు ఋతువులుగా !

చివరకు తనను
సృష్టంటారు
దేవతా సమూహంగా !
పునః సృష్టంటారు
మాతృ స్వరూపంగా !

కనుకే……
తను “బహుళం” !!
కాదు …… ఏకైకం !!

– పోరెడ్డి మృదుల ✍🏻
కవయిత్రి, తెలుగు అధ్యాపకురాలు

Avatar photo

By Editor

Digital journalist and media professional delivering accurate breaking news, impactful storytelling, and engaging content across modern platforms.