• నవంబర్ చివరి వరకు సమస్యలు పరిష్కరించకపోతే డిసెంబర్ మొదటి వారంలో రాష్ట్రవ్యాప్త పోరాటం

రామన్నపేట, నవంబర్ 16: చేనేత పరిశ్రమ, కార్మికుల సమస్యలు పరిష్కారం కావాలంటే సంఘటితంగా ఉద్యమాలు, పోరాటాలు చేయాలని తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు వనం శాంతికుమార్ పిలుపునిచ్చారు. చేనేత కార్మిక సంఘం నిర్మాణం బలంగా ఉంటేనే ఉద్యమాలు విజయవంతమవుతాయని పేర్కొన్నారు.

సోమవారం సాయంత్రం 5:30 గంటలకు రామన్నపేట చేనేత పారిశ్రామిక సహకార సంఘంలో సంఘం అధ్యక్షులు పెండెం వేణు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వనం శాంతికుమార్ మాట్లాడుతూ.. చేనేత కార్మిక సంఘం చేపట్టిన పోరాటాల ఫలితంగానే పలు సమస్యలు పరిష్కారమయ్యాయని వివరించారు.

2025 నవంబర్ 20న కమిషనర్ కార్యాలయం ఎదుట 5 వేల మందితో నిర్వహించిన ధర్నా రోజే ప్రభుత్వం రూ.33 కోట్లు విడుదల చేసిందని, అనంతరం 6,784 మంది చేనేత కార్మికులకు రూ.16.27 లక్షల రుణమాఫీ జరిగిందని తెలిపారు. అలాగే 2026 మార్చి 25న ఇందిరా పార్కు వద్ద వెయ్యి మందితో నిర్వహించిన ధర్నా ఫలితంగా 13 ఏళ్లుగా ఎన్నికలు జరగని చేనేత సహకార పారిశ్రామిక సంఘాలకు సభ్యుల ఓటరు జాబితాలు తయారు చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైందని పేర్కొన్నారు. చేనేత భరోసా పథకం కింద మూడు నెలలకు సంబంధించి రూ.4,500తో పాటు రూ.1,500 కార్మికుల ఖాతాల్లో జమ చేశారని తెలిపారు.

ప్రభుత్వానికి చేనేత కార్మిక సంఘం ప్రధాన డిమాండ్లు:

  • చేనేత కార్మికులు గత 20 నెలలుగా త్రిఫ్ట్ పథకంలో డిపాజిట్లు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం కేవలం రెండు నెలలకు మాత్రమే నగదు జమ చేసిందని, మిగిలిన బకాయిలను వెంటనే కార్మికుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. మరో ఐదు నెలల్లో పథకం ముగియనున్న నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కోరారు.
  • 2024 జనవరి నుంచి అమలు చేయాల్సిన చేనేత భరోసా పథకంలో మూడు నెలలకు మాత్రమే రూ.4,500తో పాటు రూ.1,500 జమ చేశారని, మిగిలిన బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు.
  • 59 సంవత్సరాల వయస్సులోపు జియో ట్యాగ్ ఉన్న చేనేత కార్మికుడు మరణిస్తే నేతన్న బీమా ద్వారా కుటుంబానికి రూ.5 లక్షల బీమా పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని, ఇన్సూరెన్స్ కంపెనీకి చెల్లించాల్సిన ప్రీమియాన్ని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
  • చేనేత పారిశ్రామిక సహకార సంఘాల్లో ఉత్పత్తి చేసే షూటింగ్, షర్టింగ్ వస్త్రాలు, బెడ్‌షీట్లు, జంబుఖానాలను టెస్కో ద్వారా కొనుగోలు చేసి గురుకుల పాఠశాల విద్యార్థులకు సరఫరా చేయాలని సూచించారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన విధంగానే టెండర్ల విధానం లేకుండా సహకార సంఘాల్లో తయారైన వస్త్రాలను కొనుగోలు చేయాలని కోరారు.

చేనేత కార్మికులు సంఘంలో సభ్యులుగా చేరి సంఘ నిర్మాణాన్ని పటిష్టం చేయాలని, తద్వారా ఉద్యమాలను మరింత ఉధృతం చేసి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ నెల నవంబర్ చివరి నాటికి పై సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోతే డిసెంబర్ మొదటి వారంలో పెద్ద ఎత్తున పోరాట కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వాన్ని నిలదీస్తామని వనం శాంతికుమార్ హెచ్చరించారు.

ఈ సమావేశంలో చేనేత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి ముషం నరహరి, జిల్లా అధ్యక్షులు గుర్రం నర్సింహా, రాష్ట్ర కమిటీ సభ్యులు గంజి అశోక్, సంఘం ఉపాధ్యక్షులు వనం నర్సింహా, మాజీ అధ్యక్షులు పెండెం భావనా ఋషి, కార్యదర్శి కైరంకొండ నాగభూషణం, పద్మశాలి సంఘం అధ్యక్షులు రచ్చ యాదగిరి, తొర్ర రఘు, అప్పం సంతు, సురేపల్లి జగన్ మోహన్, వనం సత్యనారాయణ, చిందం ఉమాకాంత్, మహేశ్వరం అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Avatar photo

By Murthy