న్యూస్ డెస్క్ : వరంగల్ రైల్వే స్టేషన్ సమీపంలోని డాన్ బాస్కో వీధి బాలల ఆశ్రమంలో అనాధ, సెమీ ఆర్ఫన్ మరియు వీధి బాలల కోసం నోట్‌బుక్స్, పండ్లు, చాక్లెట్లు ఉచితంగా పంపిణీ చేశారు. అనురాగ్ సొసైటీ మరియు వరల్డ్ వైజ్ కన్జుమర్ రైట్స్ అండ్ ప్రొటెక్షన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి నేషనల్ వైస్ చైర్మన్ డాక్టర్ అనితా రెడ్డి అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా డాక్టర్ అనితా రెడ్డి మాట్లాడుతూ పేదరికం ఎప్పటికీ విద్యకు అడ్డంకి కాకూడదని అన్నారు. పేద విద్యార్థులకు విద్యలో సహకారం అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గత 30 సంవత్సరాలుగా అనేక మంది పేద విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు అందించడంతో పాటు ఫీజులు కూడా చెల్లిస్తున్నామని చెప్పారు.
విద్య ద్వారానే వ్యక్తిగత, సామాజిక అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్న ఆమె, “విద్యా దానం మహాదానం” అని ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయం పేద పిల్లలకు అందించాలని కోరారు. పిల్లలకు చదువుతో పాటు మంచి నడవడిక, క్రమశిక్షణ కూడా అవసరమని సూచించారు. ప్రణాళికాబద్ధంగా లక్ష్యసాధన కోసం కృషి చేస్తే విజయం సాధించవచ్చని, చదువును కష్టంగా కాక ఇష్టంగా అభ్యసించాలని విద్యార్థులకు సూచించారు.
వేసవి సెలవుల్లో ఆటపాటలతో పాటు డ్రాప్ అవుట్ పిల్లలు, చదువులో వెనుకబడిన పిల్లలకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని విద్య బోధిస్తున్న డాన్ బాస్కో సిబ్బందిని డాక్టర్ అనితా రెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో సంతోష్ కుమార్, శారద, టీచర్లు, విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
