హన్మకొండ న్యూస్ : సీనియర్ సిటిజన్స్ కోసం ప్రభుత్వం అందిస్తున్న సేవలను ప్రతి వృద్ధుడు వినియోగించుకోవాలని సీనియర్ సిటిజన్స్ ట్రిబ్యునల్ కోర్టు మెంబర్ డాక్టర్ అనితా రెడ్డి సూచించారు. హన్మకొండ జిల్లా పరిషత్ ఆవరణలో నిర్వహిస్తున్న సీనియర్ సిటిజన్స్ డే కేర్ సెంటర్‌ను ఆమె సందర్శించి అక్కడ వృద్ధుల కోసం అందిస్తున్న సేవలను పరిశీలించారు.
ఈ సందర్భంగా డే కేర్ సెంటర్లో ఏర్పాటు చేసిన ఉచిత ఫిజియోథెరపీ క్లినిక్, లీగల్ ఎయిడ్ క్లినిక్ పనితీరును అడిగి తెలుసుకున్నారు. డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్‌కు అందిస్తున్న న్యాయ సలహాలు, కౌన్సిలింగ్ సేవల వివరాలను పారా లీగల్ వాలంటీర్‌ను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు ఎన్ని కేసులు వచ్చాయి, ఎంతమందికి సలహాలు ఇచ్చారు, కౌన్సిలింగ్ కోసం ఎంతమంది వచ్చారనే అంశాలపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా డాక్టర్ అనితా రెడ్డి మాట్లాడుతూ, సీనియర్ సిటిజన్స్ డే కేర్ సెంటర్లో వృద్ధులకు ఉచితంగా అందిస్తున్న ఫిజియోథెరపీ సేవలు, న్యాయ సలహా కేంద్రాలను వినియోగించుకోవాలని కోరారు. వృద్ధుల సమస్యల పరిష్కారంలో సీనియర్ సిటిజన్స్ ట్రిబ్యునల్ కోర్టు ఎంతో ఉపయోగకరంగా పనిచేస్తోందని తెలిపారు.
జిల్లాలో ట్రిబ్యునల్ కోర్టుకు వస్తున్న కేసులు, వాటి పరిష్కార విధానం గురించి వివరించిన ఆమె, భవిష్యత్తులో వృద్ధుల సంక్షేమం కోసం మరింత విస్తృతంగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. సీనియర్ సిటిజన్స్ చట్టంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, అన్ని శాఖల సమన్వయంతో వయోవృద్ధులకు సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.
వేసవి కాలంలో వృద్ధులకు అందిస్తున్న రాగి జావ సేవలను కూడా వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఉష, పారా లీగల్ వాలంటీర్ ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.
