హృది గదిలో………..

నీతో ఉన్న జ్ఞాపకాలను
పారేసుకోలేదు
మోసుకొని తిరుగుతున్నాను !
నీతో గడిపిన స్మృతులను
మరచిపోలేదు
నెమరు వేసుకుంటున్నాను !

నువ్వున్నప్పుడు
నా ప్రాణం నీవని
చెప్పినంత సులభం కాదు !
నువ్వు లేనప్పుడు కూడా
నా ప్రాణం తో ఉన్నానని
సరిపెట్టుకోవడం !

నువ్వు చెప్పినట్టు
నింగీ నేలా కలిసాయని
విన్నంత నిజమూ కాదు !
నువ్వు లేనప్పుడు కూడా
కలిసే ఉన్నాయని
జీర్ణించుకోవడం !

అవును…………..
తారలకై వేచిన చంద్రుడు
దిగులుతో నిండినట్టు
నీ గుబులుతో ఉన్న నన్ను
నైరాశ్యంలో నెడుతున్నావు!

నింగికేసి చూసిన
ఉషోదయాళన్నిటినీ
సంధ్యా సమయాల వరకు
నేలవైపే దించుతున్నావు !

ఏమో……………
నీకు నన్ను ప్రేమించడమే
సౌకర్యమేమో
నాకై స్పందించడం కంటే !
నన్ను పూజించడమే
స్వలాభమేమో
నాకై దరి చేరడం కంటే !

అయినా సరే…………
ఊహల నిచ్చెన మోయడమే
నాకలవాటేమో
నీ అనంతాకాశాన్ని చేరాలని !
నూతన దారులు నడవడమే
నాకురాదేమో
నీ హృదయతీరమే చాలని!

– పోరెడ్డి మృదుల✍🏻
కవయిత్రి, తెలుగు అధ్యాపకురాలు

Avatar photo

By Editor

Digital journalist and media professional delivering accurate breaking news, impactful storytelling, and engaging content across modern platforms.