తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : ప్రకృతిని దైవంగా, అడవిని తల్లిగా భావిస్తూ తమ సంస్కృతి, సంప్రదాయాలను తరతరాలుగా కాపాడుకుంటున్న ఆదివాసీ సోదర సోదరీమణులకు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ నాగరికతకు ఆదివాసీ జీవన విధానం ఒక గొప్ప ఆధారమని పేర్కొన్నారు. ప్రకృతితో మమేకమై జీవించడం, అడవులను పరిరక్షించడం వంటి విలువలను ఆదివాసీల జీవన విధానం నుంచి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
తరతరాలుగా వస్తున్న ఆదివాసీల జ్ఞానం, సమిష్టి జీవనం, సాంస్కృతిక వైభవం యావత్ మానవాళికి మార్గదర్శకంగా నిలుస్తాయని తెలిపారు. ఆదివాసీల హక్కులు, అస్తిత్వం, సంస్కృతిని గౌరవిస్తూ వారి సంక్షేమం, అభివృద్ధి, ఆత్మగౌరవం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఆదివాసీ సమాజ అభ్యున్నతికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందిస్తూ వారికి అండగా నిలవాలని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పిలుపునిచ్చారు.
