తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : కాటేదాన్ డివిజన్ పరిధిలోని బాబుల్ రెడ్డి నగర్‌లో మాజీ వార్డు సభ్యుడు సోమ శ్రీనివాస్ గుప్త ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా సోమ శ్రీనివాస్ గుప్త మాట్లాడుతూ, దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాలకు అనుగుణంగా దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. యువత దేశభక్తి, క్రమశిక్షణ, సేవా భావంతో ముందుకు సాగాలని సూచించారు. దేశ ఐక్యత, సమగ్రతను కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్నారు. బాబుల్ రెడ్డి నగర్ అభివృద్ధికి ప్రజలతో కలిసి నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. వేడుకల్లో స్థానికులు, యువకులు,  తదితరులు పాల్గొన్నారు.