తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : తెలంగాణ రాష్ట్రంలోని ఏ ఒక్క కుటుంబం ఆర్థిక భద్రత లేక ఇబ్బందులు పడకూడదన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కల్వకుర్తి శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణరెడ్డి తెలిపారు. ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ఈ నెల 19న ప్రారంభించ నున్నట్లు వెల్లడించారు.
రాష్ట్రంలోని సుమారు 1.15 కోట్ల కుటుంబాలకు రూ.5 లక్షల జీవిత బీమా కల్పించాలనే సంకల్పంతో ఈ పథకాన్ని తీసు కొచ్చినట్లు ఎమ్మెల్యే వివరించారు. పేద, మధ్యతరగతి, ధనిక అనే తేడా లేకుండా ప్రతి కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించాలన్నదే ప్రభుత్వ ఆలోచనగా పేర్కొన్నారు. భారతరత్న, మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఈ పథకాన్ని ప్రారంభించడం విశేషమని అన్నారు. దేశ తొలి మహిళా ప్రధానమంత్రి ఇందిరాగాంధీ మహిళా సాధికారతకు, దేశ ఐక్యతకు, ప్రజల సంక్షేమానికి చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.
మహిళలు తమ సామర్థ్యంతో అన్ని రంగాల్లో రాణించాలని, వారికి సమాన అవకాశాలు కల్పించాలనే ఇందిరాగాంధీ ఆశయాలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తోందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రతి కుటుంబానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని కసిరెడ్డి నారాయణరెడ్డి పేర్కొన్నారు. గతంలో రైతులకు మాత్రమే పరిమితమైన బీమా సదుపాయాలకు భిన్నంగా, ప్రస్తుత ప్రభుత్వం విస్తృత స్థాయిలో కుటుంబాలకు బీమా భరోసా కల్పించే దిశగా చర్యలు చేపట్టిందన్నారు. కుటుంబంలో సంపాదించే వ్యక్తిని కోల్పోయినప్పుడు ఆ కుటుంబం ఆర్థికంగా కుంగిపోకుండా రూ.5 లక్షల బీమా సాయం అండగా నిలుస్తుందని వివరించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. పేదలకు సొంత ఇంటి కలను నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకం, రైతులకు ఎకరాకు రూ.12 వేల ఆర్థిక సహాయం అందించే రైతు భరోసా, మహిళలకు రూ.500కే గ్యాస్ సిలిండర్, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, మహిళా స్వయం సహాయక సంఘాలకు రుణ సదుపాయాలు కల్పిస్తున్నట్లు వివరించారు.అదేవిధంగా ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం, యువతకు ఉపాధి అవకాశాలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ సంక్షేమ కార్యక్రమాలకు తోడుగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం మరో కీలక ముందడుగుగా నిలుస్తుందని అన్నారు.
ఈ పథకంపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించి, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ప్రయోజనాలు అందేలా అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రజల ఆర్థిక భద్రతను దృష్టిలో పెట్టుకొని ఇంతటి గొప్ప పథకాన్ని ప్రవేశపెట్టిన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రులకు, ఎంపీలకు, సహచర ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు కసిరెడ్డి నారాయణరెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
