తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : పేదింటి ఆడబిడ్డల వివాహాలకు అండగా నిలిచే ఉద్దేశంతో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ఎంతో మంది పేద కుటుంబాలకు భరోసాగా నిలిచాయని బీఆర్‌ఎస్ నాయకులు అన్నారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆడబిడ్డలకు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని విస్మరించిందని వారు ఆరోపించారు. కల్యాణలక్ష్మి పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని విమర్శిం చారు. హైకోర్టులో ప్రభుత్వం తరఫున కౌంటర్ దాఖలు చేయకపోవడం, అనంతరం కోర్టు తీర్పును సాకుగా చూపుతూ పేదల సంక్షేమ పథకాలకు తూట్లు పొడుస్తున్నారని ఆరోపించారు. కే.సి.ఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఒక్కొక్కటిగా రద్దు చేసే ప్రయత్నాలను అడ్డుకోవాలని డిమాండ్ చేస్తూ మణికొండ, నెక్నంపూర్‌కు చెందిన బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు, మహిళా నాయకురాళ్లు, యువ నాయకులు, పార్టీ అభిమానులు, స్థానిక ప్రజలు గండిపేట మండల అధికారి కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. తహసీల్దార్ అందుబాటులో లేకపోవడంతో డిప్యూటీ తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీతారాం ధూళిపాళ, గుట్టమీది నరేందర్, అందె లక్ష్మణ్‌రావు, సుమనళిని, సుమన్, షకీలా రెడ్డి, రేఖ, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
