తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, కామారెడ్డి: తెలంగాణలో రైల్వే ప్రయాణికుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. మల్కాజ్‌గిరి–కామారెడ్డి మధ్య సుమారు 108 కిలోమీటర్ల మేర అధునాతన ‘కవచ్ 4.0’ రైల్వే భద్రతా వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చింది.

రైల్వే వ్యవస్థ అధికారులు మాట్లాడుతూ రైలు ప్రమాదాలను నివారించడంలో కవచ్ వ్యవస్థ కీలకంగా పనిచేస్తుంది. ముఖ్యంగా రైలు డ్రైవర్ సిగ్నల్‌ను గమనించకపోయినా లేదా ప్రమాదకర పరిస్థితుల్లో రైలు వేగాన్ని తగ్గించాల్సిన అవసరం ఉన్నా ఈ వ్యవస్థ అప్రమత్తం చేస్తుంది. అవసరమైన సందర్భాల్లో ఆటోమేటిక్‌గా బ్రేకులు అమలు చేసి రైలును నియంత్రించేందుకు సహాయపడుతుంది అని సూచించారు.

అదేవిధంగా ఒకే ట్రాక్‌పై రెండు రైళ్లు ప్రమాదకరంగా సమీపించే పరిస్థితులను గుర్తించి, ఎదురెదురుగా ఢీకొనే ప్రమాదాలను నివారించడంలో కూడా కవచ్ సాంకేతికత ఉపయోగపడుతుంది. రైలు వేగం, సిగ్నల్స్, ట్రాక్‌పై రైళ్ల కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తూ భద్రతను పెంచుతుంది.

మల్కాజ్‌గిరి–కామారెడ్డి మార్గంలో కవచ్ 4.0 ఏర్పాటు కావడంతో ఈ మార్గంలో నడిచే రైళ్ల ప్రయాణం మరింత సురక్షితంగా మారనుంది. ముఖ్యంగా హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల నుంచి కామారెడ్డి వైపు రాకపోకలు సాగించే ప్రయాణికులకు ఇది అదనపు భరోసాను కల్పించనుంది.

రైల్వేలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తరిస్తూ ప్రమాదాలను తగ్గించడం, ప్రయాణికుల భద్రతను పెంచడమే లక్ష్యంగా ఈ చర్యలు కొనసాగుతున్నాయి. కవచ్ 4.0తో తెలంగాణ రైల్వే భద్రతా వ్యవస్థలో మరో కీలక ముందడుగు పడింది అన్నారు.