విజయవాడ కనకదుర్గమ్మకు పద్మశాలి సంఘాల ఆధ్వర్యంలో 10 పట్టు చీరల సమర్పణ
తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, విజయవాడ: అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షుడు కందగట్ల స్వామి నేతృత్వంలో, విజయవాడ శ్రీ కనకదుర్గ దేవాలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు జి.వి. నాగేశ్వరరావు, శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేకంగా నేసిన చేనేత పట్టు చీరలను సమర్పించారు. పది రోజుల పాటు అమ్మవారికి సమర్పించేందుకు పది పట్టు చీరలను అందజేశారు.

పద్మశాలి చేనేత కళాకారుల నైపుణ్యానికి ప్రతీకగా నిలిచే చేతితో నేసిన చేనేత వస్త్రాలను అమ్మవారికి సమర్పించడం పట్ల పద్మశాలి సంఘాల నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. చేనేత వృత్తి ప్రాముఖ్యతను చాటిచెప్పడంతో పాటు, సంప్రదాయ చేనేత కళను ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో అఖిల భారత పద్మశాలి సంఘం, తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘాలకు చెందిన ప్రముఖులు, కందగట్ల స్వామి, గడ్డం జగన్నాధం, వనం విశ్వనాథం, దుష్యంతుల, బొళ్ల శివశంకర్, రాపోలు సుధాకర్, బొద్దుల లక్ష్మణ్, మెతుకు సత్యం, గుర్రం శ్రావణ్ కుమార్, గుంటక రూప, పోరండ్ల శారద, నోముల రేఖ, చిన్నకోట్ల స్వప్న, గుర్రం విశ్వేశ్వర్ రావు, కర్నాటి విజయ్, కైరంకొండ ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.
చేనేత వస్త్రాలను అమ్మవారికి సమర్పించడం ద్వారా పద్మశాలి సమాజ ఆధ్యాత్మిక భక్తితో పాటు, తరతరాలుగా వస్తున్న చేనేత సంప్రదాయ పరిరక్షణకు తమ వంతు కృషి చేసినట్లు నాయకులు తెలిపారు.
