• పహాచాన్ కార్డుల జారీలో జాప్యంపై మంత్రి దృష్టికి తీసుకెళ్లిన చేనేత నాయకులు
తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, కరీంనగర్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్‌ను తెలంగాణ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు రాపోలు వీర మోహన్ మర్యాదపూర్వకంగా కలిశారు. అక్టోబర్ 11న కరీంనగర్‌లోని శ్రీ మహాశక్తి దేవాలయంలో దేవీ నవరాత్రుల ప్రారంభోత్సవం సందర్భంగా అమ్మవారి సన్నిధిలో ఉన్న కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను రాపోలు వీర మోహన్ కలిసి, అమ్మవారి దీక్షలో ఉన్న ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
పహాచాన్ కార్డుల జారీలో జాప్యంపై చర్చ
కేంద్ర ప్రభుత్వం చేనేత కార్మికుల కోసం అమలు చేస్తున్న పహాచాన్ కార్డుల జారీ ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతోందని రాపోలు వీర మోహన్ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కార్డులు సకాలంలో అందకపోవడంతో చేనేత కార్మికులకు స్టాండ్ మగ్గాల సబ్సిడీ పథకం ప్రయోజనాలు పొందడంలో ఆలస్యం జరుగుతోందని వివరించారు. ఈ జాప్యం కారణంగా కార్మికులు ఆర్థికంగా నష్టపోతున్నారని పేర్కొంటూ, సమస్యను త్వరగా పరిష్కరించాలని కోరారు.
త్వరితగతిన కార్డులు జారీ చేయిస్తామని మంత్రి హామీ
చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందించిన కేంద్ర మంత్రి బండి సంజయ్, చేనేత జౌళి శాఖ అధికారులతో మాట్లాడి వీలైనంత త్వరగా పహాచాన్ కార్డులు జారీ అయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు చేనేత ఐక్య వేదిక ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షులు గుండేటి రమేశ్, మహిళా విభాగం నాయకురాలు రాజేశ్వరి పాల్గొన్నారు.
