తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: గచ్చిబౌలి డివిజన్, గోపన్పల్లిలోని శిశుమంగల్ అనాధ ఆశ్రమంలో జాతీయ విద్యార్థి దినోత్సవాన్ని ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించి విద్యార్థినీ విద్యార్థులకు పండ్లు, బిస్కెట్లు, పంచిపెట్టారు. అనంతరం, అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిపోయిన రామస్వామి యాదవ్ మాట్లాడుతూ, భారతరత్న అబ్దుల్ కలాం జన్మదినోత్సవాన్ని జాతీయ విద్యార్థి దినోత్సవంగా జరుపుకుంటున్నామని అందుకు కారణం విద్య పట్ల ఆయనకు ఉన్న లోతైన నిబద్దత, విద్యార్థులతో ఆయనకు ఉన్న అనుబంధమని సమాజంలో విద్యార్థుల ప్రాముఖ్యతను తెలియజేసేందుకు జాతీయ విద్యార్థి దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నామని అన్నారు. భారతదేశ 11వ రాష్ట్రపతిగా, భారత అంతరిక్ష , సైనిక పరిశోధనల పురోగతికి గణనీయమైన కృషిచేసిన అత్యుత్తమ విద్యా వేత్తలలో కలాం ఒకరని భారతదేశ అణు సామర్థ్యాలకు ఆయన విశేషమైన కృషి చేశారని అన్నారు. ఆయన డీఆర్డీఓ అధిపతిగా, అలాగే ఐఎస్ఆర్ఓ లో కూడా పనిచేశారని ఫోక్రన్ అణు పరీక్షలలో కీలకపాత్ర పోషించారని ఆయన శాస్త్రీయ విజయాలకు మించి విద్య అవిష్కరణ, జాతీయ అభివృద్ధి కోసం కృషిచేసి యువతకు స్ఫూర్తి దాయకంగా నిలిచారు. ఆయన సరళత, దార్శనికత ప్రజల సంక్షేమం పట్ల నిబద్దతలే ఆయనను దేశ చరిత్రలో ప్రియమైన అధ్యక్షునిగా చేశాయని ఆయన నడవడిక మన అందరికి ఆచరణీయమని ఆయన బాలిస్టిక్ క్షిపణులను, లాంఛ్ వెహికల్ టెక్నాలజీని అభివృద్ధి చేయడంతో విశేషమైన కృషిసల్పారని అందుకనే ఆయనకు మిసైల్ మాన్ అనే పేరు వచ్చిందని ప్రపంచ గగన వీధులలో భారత కీర్తి పతాకాన్ని ఇనుమడింపజేసిన గొప్ప అంతరిక్ష శాస్త్రవేత్త అని కొనియాడారు. ఆయన భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలపడానికి విజన్ 2020ని రూపొందించిన గొప్ప దార్శనికుడని లక్ష్య సాధనలో సాంకేతికత, విద్యా , స్థిరమైన అభివృద్ధి మొదలైన వాటి విలువను నొక్కి చెప్పారని ఆయన గొప్ప మానవతావాదని వికలాంగులకు కృత్రిమ అవయవాల రూపకల్పన, అలాగే గుండె జబ్బుల వారికి అవసరమైన స్టంట్లు సామాన్య ప్రజలకు ధరలు అందుబాటులో ఉండే విధంగా స్టంట్ల తయారీలో కీలకపాత్ర పోషించారని ఆయన అందించిన సేవలకు భారత ప్రభుత్వం భారతరత్నతో సత్కరించడం జరిగిందని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక విశ్వవిద్యాలయాలు ఆయనను గౌరవ డాక్టరేట్లు మరియు బిరుదులతో సత్కరించడం జరిగిందని తెలిపారు. ఆయన జాతి గర్వించదగ్గ ముద్దుబిడ్డ అని కొనియాడారు. ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని నేటి విద్యార్థులు ఈ పోటీ ప్రపంచంలో విలువలతో కూడిన గుణాత్మక విద్యను అభ్యసించడం ద్వారా అది దేశ భవిష్యత్తును మార్చగలదు. విద్య తోటే సంస్కారం అలవడుతుందని అందుకు ఏకాగ్రత, పట్టుదల, కృషి మొదలైన వాటితో పాటు విద్యా రంగంలో వస్తున్న అనేక మార్పులకు అనుగుణంగా నూతన సాంకేతికతలో ప్రావీణ్యతలను సంపాదించుకోవాలని అలాగే మద్యపానము, ధూమపానము, మాదకద్రవ్యాల వినియోగం వంటి చెడు అలవాట్లకు దూరముగా ఉండటం, సమయాన్ని వృధా చేసే సోషల్ మీడియాకు దూరంగా ఉండటం చాలా మంచిదని అంతే కాకుండా నిత్యము వ్యాయామము, మెడిటేషన్, యోగా చేయడం, పౌష్టికాహారం తీసుకోవడంతో పాటు, ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, ప్రపంచ విద్యార్థులకు ధీటుగా రాణించి అన్ని అవకాశాలను అందిపుచ్చుకోవడానికై కలలు కని వాటి సాకారానికై కృషి చేసి, దేశాభివృద్ధిలో పాలు పంచుకొని మన దేశ కీర్తి ప్రతిష్టలను ఇనుమడింప చేయాలని భాషా నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని చేతి వ్రాత బాగుండాలని నిత్యము పుస్తక పఠనము చేయాలని విద్య తోటే జ్ఞానము, ధైర్యము కలుగుతాయని అప్పుడే మనం అభివృద్ధి చెందిన దేశాలతో పోటీపడి విజయం సాధించగలుగుతామని అదే మనము కలాంకి అర్పించే నిజమైన నివాళని తెలిపారు. ఈ కార్యక్రమంలో శిశు మంగళ్ అనాధాశ్రమం నిర్వాహకులు శ్రీనివాస్ , అధ్యాపకుల విద్యార్థిని, విద్యార్థులు , ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు అమ్మయ్య చౌదరి జీవి రావు శివరామకృష్ణ, పాలం శ్రీను తదితరులు పాల్గొన్నారు.
