చేనేత సహకార సంఘాల క్యాష్ క్రెడిట్ రుణాలు పూర్తిగా మాఫీ చేయాలని వినతి

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర చేనేత అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ దూడం వెంకటరమణ నూతన కార్యాలయ ప్రవేశం సందర్భంగా తెలంగాణ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు రాపోలు వీర మోహన్ ఆయనను శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు.

హైదరాబాద్‌లోని నాంపల్లి చేనేత భవన్‌లో గురువారం చేనేత అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్‌గా దూడం వెంకటరమణ నూతన కార్యాలయంలో అధికారికంగా బాధ్యతల కార్యక్రమం నిర్వహించిన సందర్భంగా ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా చేనేత రంగ అభివృద్ధికి సంబంధించిన సమస్యలను ప్రస్తావిస్తూ, చేనేత సహకార సంఘాలపై ఉన్న క్యాష్ క్రెడిట్ రుణాలను పూర్తిగా మాఫీ చేయాలని కోరుతూ రాపోలు వీర మోహన్ చైర్మన్‌కు వినతి పత్రం అందజేశారు.

చేనేత సహకార సంఘాల ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని క్యాష్ క్రెడిట్ రుణాల మాఫీకి అవసరమైన చర్యలు తీసుకోవాలని వినతి పత్రంలో కోరినట్లు తెలిపారు. రుణాల మాఫీతో సహకార సంఘాలకు ఆర్థిక వెసులుబాటు కలిగి, చేనేత రంగం అభివృద్ధికి తోడ్పడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాపోలు వీర మోహన్‌తో పాటు గ్రేటర్ హైదరాబాద్ చేనేత ఐక్య వేదిక ప్రధాన కార్యదర్శి చెరుకు విజయ్ పాల్గొన్నారు.

Avatar photo

By Murthy