తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, హైదరాబాద్: ఈరవత్రి అనిల్ కుమార్ కు గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీ (MLC) పదవి కేటాయించాలని పద్మశాలి సంఘం నాయకులు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.
గత నెల 30న సిరిసిల్ల సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీకి అనుగుణంగా, బీసీ వర్గాల్లో పద్మశాలి సామాజిక వర్గానికి తగిన ప్రాతినిధ్యం కల్పించేందుకు ఈరవత్రి అనిల్ కు శాసనమండలి సభ్యుడిగా అవకాశం ఇవ్వాలని కోరారు.

చేనేత కార్మికుల సంక్షేమానికి చేసిన సేవలు:
పద్మశాలి సంగం నిర్వహించే ప్రతి కార్యక్రమాన్ని తన కార్యక్రమంగా భావించి విజయవంతం చేయడంలోను, ప్రభుత్వంతో సమన్వయం సాధించడంలోను ఈరవత్రి అనిల్ కీలక పాత్ర పోషించారని నేతలు గుర్తుచేశారు. ప్రతిసారి సంఘం అతని దృష్టికి తీసుకుపోయే ప్రతి విషయాన్ని ప్రభుత్వంతో చర్చించి అందర్నీ సమన్వయం చేస్తున్న ఫలితంగానే రాష్ట్రంలో:
రూ. 49 కోట్ల చేనేత రుణమాఫీ అమలు సాధ్యమైంది.
నిలిచిపోయిన రూ. 290 కోట్ల ‘చేనేత చేయూత’ బకాయిలు విడుదలయ్యాయి. తెలంగాణలో పద్మశాలి మరియు వివిధ సామాజిక వర్గాలకు చెందిన సామాన్య ప్రజలు ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి ప్రమాదవశాత్తు మరణించిన కార్మికుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం అందించే విధానాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అది అమలయేలా చేసిదాంట్లో కృషి చేశారు.

బహుముఖ ప్రజాసేవకు, కాంగ్రెస్ పార్టీకి ఆయన చేసిన సేవలను గుర్తించి ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తే బీసీ సామాజిక వర్గానికి, ముఖ్యంగా చేనేత వర్గాలకు రాజకీయంగా పెద్దపీట వేసినట్లవుతుందని పద్మశాలి సంఘం నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత పద్మశాలి సంఘం సెక్రటరీ జనరల్ గడ్డం జగన్నాథం, తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కామర్తపు మురళి, ప్రధాన కార్యదర్శి మాచర్ల రామచంద్రరావు, గౌరవ అధ్యక్షులు మెతుకు సత్యం, ఉపాధ్యక్షులు గుర్రం శ్రవణ్, అఖిలభారత పద్మశాలి సంఘం యువజన విభాగం జాతీయ ఇంచార్జ్ అవ్వారి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు

Avatar photo

By Murthy