• విద్యా సంస్కరణలతో పాటు బడ్జెట్ పాఠశాలల అభివృద్ధికి అవకాశం కల్పించాలి
తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో ప్రతిపాదిత 10+2 విద్యా విధానం అమలులో ప్రైవేట్ పాఠశాలల పరిరక్షణ, అభివృద్ధికి తగిన ప్రాధాన్యం కల్పించేలా సమగ్ర విధానాన్ని రూపొందించాలని బడ్జెట్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (BSMAT) ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. విద్యా రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ప్రైవేట్ పాఠశాలలు కూడా అభివృద్ధి చెందేందుకు అవసరమైన అవకాశాలు, వెసులుబాట్లు కల్పించాలని కోరింది.

ఈ మేరకు BSMAT ప్రతినిధులు తెలంగాణ పాఠశాల విద్యాశాఖ సంచాలకులు నవీన్ నికోలస్, ఐఏఎస్‌ను కలిసి ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఎదుర్కొంటున్న అంశాలను వివరించారు. ప్రతిపాదిత 10+2 విద్యా విధానంలో ప్రైవేట్ పాఠశాలల ప్రయోజనాలను పరిరక్షిస్తూ, విద్యా సంస్కరణల్లో వాటికి సముచిత స్థానం కల్పించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు.
తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేట్ పాఠశాలలు కూడా విద్యాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయని BSMAT ప్రతినిధులు పేర్కొన్నారు. ముఖ్యంగా బడ్జెట్ పాఠశాలలు సామాన్య, మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు అందుబాటు ఫీజులతో విద్యను అందిస్తూ విద్యావ్యాప్తికి దోహదపడుతున్నాయని వివరించారు. పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ వేలాది మంది విద్యార్థులకు విద్యావకాశాలు కల్పిస్తున్న ప్రైవేట్ పాఠశాలల సేవలను గుర్తించి, వాటి అభివృద్ధికి అనుకూలమైన విధానాన్ని రూపొందించాలని విజ్ఞప్తి చేశారు.
ప్రతిపాదిత 10+2 విద్యా విధానం ద్వారా విద్యార్థులకు ఉన్నత తరగతుల వరకు ఒకే పాఠశాల పరిధిలో విద్యను అభ్యసించే అవకాశం కల్పించే దిశగా ప్రభుత్వం ఆలోచించడం స్వాగతించదగిన పరిణామమని ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. ఈ మార్పుల్లో ప్రైవేట్ పాఠశాలలకు కూడా 11, 12 తరగతులను నిర్వహించే అవకాశాన్ని కల్పించాలని కోరారు. ఇందుకు అవసరమైన గుర్తింపులు, అనుమతులు, మౌలిక సదుపాయాల ప్రమాణాలపై స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించాలని సూచించారు.
అలాగే పాఠశాలల భవనాలు, తరగతి గదులు, ప్రయోగశాలలు, ఆటస్థలాలు, ఇతర మౌలిక సదుపాయాలకు సంబంధించి ఆచరణ సాధ్యమైన నిబంధనలు రూపొందించాలని కోరారు. ఇప్పటికే గుర్తింపు పొంది విద్యార్థులకు విద్యను అందిస్తున్న పాఠశాలల పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని, వాటి ప్రస్తుత గుర్తింపులు, విద్యార్థుల విద్యా కొనసాగింపునకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన వెసులుబాట్లు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
కొత్త విద్యా విధానం అమలులో ఉపాధ్యాయుల అర్హతలు, నియామకాలు, శిక్షణ, పాఠ్యప్రణాళిక, పరీక్షల విధానం, విద్యార్థులకు జారీ చేసే ధ్రువపత్రాలపై ముందుగానే స్పష్టత ఇవ్వాలని సూచించారు. చిన్న, మధ్యతరహా పాఠశాలలు కూడా నాణ్యమైన విద్యను అందించేలా అవసరమైన సాంకేతిక, మౌలిక సదుపాయాల కల్పనకు తగిన సమయం ఇవ్వాలని కోరారు.
విద్యా సంస్కరణలు విజయవంతం కావాలంటే ప్రభుత్వం, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు, విద్యావేత్తలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని BSMAT ప్రతినిధులు పేర్కొన్నారు. విధాన రూపకల్పన, అమలు ప్రక్రియలో ప్రైవేట్ పాఠశాలల సంఘాలకు కూడా భాగస్వామ్యం కల్పించాలని కోరారు. విద్యార్థుల ప్రయోజనాలు, తల్లిదండ్రుల ఆర్థిక స్థోమత, పాఠశాలల నిర్వహణ సామర్థ్యం వంటి అంశాలను సమన్వయం చేస్తూ సమతుల్యమైన విధానం తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వానికి BSMAT విజ్ఞప్తి ఏమిటంటే.. 10+2 విద్యా విధానం రాష్ట్ర విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేసేలా ఉండటంతో పాటు, తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలన్నింటికీ అభివృద్ధి అవకాశాలు కల్పించాలి. ముఖ్యంగా బడ్జెట్ పాఠశాలల మనుగడకు భరోసా కల్పిస్తూ, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుబాటులో ఉండేలా ప్రైవేట్ పాఠశాలలను పరిరక్షించే సమగ్ర విధానాన్ని ప్రభుత్వం రూపొందించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో BSMAT రాష్ట్ర అధ్యక్షులు శ్రీపతి శేఖర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి జె. మల్లారెడ్డి, రాష్ట్ర కోశాధికారి జె. శ్రీనివాసరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ డా. పి. జాలంధర్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం, దయాకర్ రెడ్డి, బుచ్చిరెడ్డి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు నారాయణరెడ్డి, కోశాధికారి మునీందర్ రావుతో పాటు BSMAT ప్రతినిధులు, పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు, విద్యావేత్తలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
