• గుజ్జ సత్యం, జాతీయ ఉపాధ్యక్షుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం
తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, హైదరాబాద్: మలిదశ తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన తెలంగాణవాది, స్వాతంత్ర్య సమరయోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా గుజ్జ సత్యం మాట్లాడుతూ.. సబ్బండ వర్గాలు ఆత్మగౌరవంతో, సమాన అవకాశాలతో జీవించాలన్నదే కొండా లక్ష్మణ్ బాపూజీ ఆకాంక్ష అని అన్నారు. తెలంగాణ కోసం తన స్వగృహమైన జలదృశ్యాన్ని సైతం ఉద్యమానికి అంకితం చేసిన బాపూజీ త్యాగం, దూరదృష్టికి నిదర్శనమన్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడి 12 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో బాపూజీ ఆశించిన సామాజిక న్యాయం, సమాన అవకాశాల సాధనపై సమాజం మరోసారి చర్చించాల్సిన అవసరం ఉందన్నారు.
విద్య, వైద్యం, ఉపాధి, ఆర్థిక ప్రగతి, రాజకీయ ప్రాతినిధ్యం వంటి రంగాల్లో అన్ని వర్గాలకు సమాన అవకాశాలు అందినప్పుడే సంపూర్ణ తెలంగాణ సాధ్యమవుతుందని పేర్కొన్నారు. సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ అంశాలపై కుల సర్వే నిర్వహించి, దాని ఆధారంగా విద్య, ఉపాధి, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం బిల్లులను ఆమోదించి రాష్ట్రపతి ఆమోదానికి పంపినట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల వెల్లడించింది.
ప్రస్తుత పరిస్థితుల్లో బీసీలు, పేదలు, బలహీన వర్గాలకు విద్య, ఉపాధి, రాజకీయ అవకాశాల్లో తగిన ప్రాతినిధ్యం కల్పించడంపై ప్రభుత్వం మరింత దృష్టి సారించాలని గుజ్జ సత్యం కోరారు. స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్ల అంశం కూడా కీలకంగా మారిందని, ప్రస్తుతం రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ అమల్లో ఉందని ప్రభుత్వ బీసీ సంక్షేమ శాఖ పేర్కొంటోందన్నారు.
“భూమి, ఆత్మగౌరవం, సామాజిక న్యాయం కోసం సాగిన తెలంగాణ పోరాట స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లడమే బాపూజీకి నిజమైన నివాళి. సామాజిక అసమానతలు తొలగి, బహుజన వర్గాలకు సమాన అవకాశాలు లభించే తెలంగాణ నిర్మాణం కోసం ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఉద్యమించాలి” అని గుజ్జ సత్యం అన్నారు.
నిరుద్యోగ యువత సమస్యలపైనా ప్రభుత్వం దృష్టి సారించాలని ఆయన కోరారు. కాగా, ప్రభుత్వ ఖాళీలను దశలవారీగా భర్తీ చేస్తామని, ఆరు నెలలకు ఒకసారి పోటీ పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇటీవల ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కన్వీనర్ కర్నాటి ధనంజయ, బీసీ సమన్వయ సంఘాల రాష్ట్ర అధ్యక్షులు బొమ్మ రఘురాంనేత, ఈశ్వరమ్మ యాదవ్ , పెద్ది జగదీష్ , జ్ఞానేశ్వర్, వెంకన్న, అశోక్, వివిధ బీసీ సంఘాల ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు.
