తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : తెలంగాణ రాష్ట్రంలో జాతీయ ఆరోగ్య మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం) పరిధిలో పనిచేస్తున్న సుమారు 17 వేల మంది ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం నిరవధిక సమ్మెకు దిగారు. ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు తమ సేవలను తక్షణమే క్రమబద్ధీకరించాలని డిమాండ్‌ చేస్తూ విధులను బహిష్కరించారు. హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌ ధర్నా చౌక్‌ వద్ద రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల ఎన్‌హెచ్‌ఎం జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ప్రభుత్వం స్పందించే వరకు పోరాటం ఆగదు…

ఏళ్ల తరబడి ప్రజారోగ్య సేవల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించకపోవడం, సేవలను క్రమబద్ధీకరించకపోవడం అన్యాయమని నిరసనకారులు పేర్కొన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి తమ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్‌ చేశారు.

ఉద్యోగులకు ప్రస్తుత వేతన విధానాన్ని సవరించి స్థూల వేతనంలో 100 శాతం చెల్లింపులు అమలు చేయాలని, ప్రతి ఏడాది 5 శాతం వేతన పెంపు కల్పించాలని కోరారు. మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు మంజూరు చేయడంతో పాటు సమగ్ర ఆరోగ్య బీమా, జీవిత బీమా సదుపాయాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు.

ప్రజారోగ్య సేవలపై సమ్మె ప్రభావం

సమ్మెలో భాగంగా సాధారణ వైద్య సేవలు, ఆన్‌లైన్‌ పోర్టల్‌ నమోదు ప్రక్రియలు, టీకాల కార్యక్రమాలు సహా తమ విధులను ఉద్యోగులు బహిష్కరించినట్లు జాయింట్‌ యాక్షన్‌ కమిటీ వెల్లడించింది. ప్రభుత్వం తమ డిమాండ్లపై స్పష్టమైన నిర్ణయం తీసుకునే వరకు నిరవధిక సమ్మె కొనసాగుతుందని ప్రకటించింది.

ఈ సందర్భంగా డాక్టర్‌ ఖాజీ మిస్బా అహ్మద్‌ మాట్లాడుతూ, ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలని కోరారు. ప్రజలకు ఆరోగ్య సేవలు అందించడంలో కీలకంగా పనిచేస్తున్న ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.

 

 

 

You missed