తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : రాజేంద్రనగర్ నియోజకవర్గం కాటేదాన్ డివిజన్ పరిధిలోని బాబుల్ రెడ్డి నగర్‌లో బొడ్రాయి వద్ద శ్రీ నవదుర్గ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో శరన్నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. దుర్గామాత మండపం వద్ద ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ భక్తులు అమ్మవారిని దర్శించు కుంటున్నారు. ఉత్సవాల్లో భాగంగా అమృత కళాక్షేత్రం ఆధ్వర్యంలో నిర్వహించిన కూచిపూడి శాస్త్రీయ నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విద్యార్థులు తమ అద్భుతమైన నృత్య ప్రతిభ, హావభావాలు, లయబద్ధమైన ప్రదర్శనలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాటేదాన్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎస్. వెంకటేష్ పాల్గొన్నారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే శాస్త్రీయ నృత్యాలు మన దేశ గొప్పతనానికి ప్రతీకలని ఆయన అన్నారు. కూచిపూడి వంటి ప్రాచీన కళారూపాలను పరిరక్షించి, భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. విద్యార్థులు చదువుతోపాటు కళలపై ఆసక్తి పెంపొందించుకోవాలని, కళాకారులను ప్రోత్సహించడం ద్వారా మన సంస్కృతి, సంప్రదాయాలకు మరింత గుర్తింపు లభిస్తుందని తెలిపారు.

అమృత కళాక్షేత్రం విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలను వెంకటేష్ అభినందించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న కళా ప్రతిభను వెలికితీయడంతోపాటు, శాస్త్రీయ నృత్య సంప్రదాయాలను భావితరాలకు పరిచయం చేసే ఇలాంటి కార్యక్రమాలు అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా భక్తి, ఆధ్యాత్మికతతోపాటు భారతీయ కళా సంప్రదాయాలకు ప్రాధాన్యతనివ్వడం విశేషమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అమృత కళాక్షేత్రం అధ్యక్షుడు వంగ శ్రీనాథ్ బాబు గౌడ్, గురువు కె. పావని నరేష్ గౌడ్, శ్రీ నవదుర్గ ఉత్సవ సమితి సభ్యులు, స్థానిక బస్తీ వాసులు పాల్గొన్నారు.

 

You missed