న్యూస్ డెస్క్ : తంబాకు అలవాటు ప్రాణాలతో చెలగాటమని, తంబాకు వినియోగాన్ని తగ్గించేందుకు సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అనురాగ్ సొసైటీ చైర్మన్, కాకతీయ విశ్వవిద్యాలయం పాలక మండలి సభ్యురాలు డాక్టర్ అనితా రెడ్డి అన్నారు.
ప్రపంచ తంబాకు నిరోధక దినోత్సవం సందర్భంగా ఆటో డ్రైవర్లు, స్లమ్ ప్రాంతాల నివాసితులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తంబాకు వాడకాన్ని తగ్గించేందుకు ప్రజల్లో చైతన్యం పెంపొందించడం, ముఖ్యంగా పిల్లలను తంబాకు పరిశ్రమల ప్రభావం నుంచి రక్షించడం అత్యంత అవసరమని పేర్కొన్నారు.
ప్రతి ఏడాది తంబాకు వినియోగం కారణంగా కోట్లాది మంది ప్రాణాలు కోల్పోతున్నారని, అనేక మంది క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తంబాకు నియంత్రణలో ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, ఆరోగ్య నిపుణులు, ఉపాధ్యాయులు మరియు ప్రతి పౌరుడు సమిష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.
తంబాకు వినియోగం కేవలం వ్యక్తిగత ఆరోగ్య సమస్య మాత్రమే కాదని, అది ఒక సామాజిక బాధ్యతతో కూడిన అంశమని తెలిపారు. తంబాకు వాడే వ్యక్తులతో పాటు వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యంపైనా దాని ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. తంబాకు అలవాటు వల్ల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టుకోవద్దని, కుటుంబాలను ఇబ్బందులకు గురి చేయవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
